Sunday, September 6, 2015

రెండు ఫోటోలు - రెండు ఆలోచనలు


ఈ ఫొటోలో చనిపోయిన చిన్నారి బాలుణ్ని చూడండి - గుండె కలచివేయట్లేదూ? ఎర్ర టీషర్టూ, బ్లూ షార్ట్సూ, షూస్, తెల్లని మేనిఛాయతో అచ్చు దొరబాబులా.. పాపం! అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఈ ఫోటో చూసి చాలమందికి షాకయ్యారు. అందుకే సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది.


ఇప్పుడీ పాపని చూడండి. మాసిపోయిన బట్టలు, పుల్లల్లాంటి కాళ్ళూ చేతుల్తో నేలపాలైన ఆహారాన్ని ఆబగా నోట్లో కుక్కుకుంటూ ఆకలి తీర్చుకుంటుంది. ఈ రెండో ఫొటో చూస్తే మొదటి ఫొటో అంత షాకింగ్‌గా లేదు కదూ? అవును, మనని రెండో ఫొటో కదిలించదు. అంచేత ఫేస్బుక్కులో ఎవరికీ షేర్ చేసుకోం.

ఎర్రని టీషర్టు తెల్లటి పిల్లవాడు అచ్చు మన పిల్లాడిలాగే వున్నాడు. ఇంకో సౌకర్యం ఆ పిల్లాడు మన దేశానికి చెందినవాడు కాదు. ఆ రాజకీయాలు మనకి అనవసరం. మనకి జెనరల్ నాలెడ్జి, సామాజిక స్పృహ, స్పందించే గుణం వుందని మన ఫేస్బుక్ స్నేహితులకి తెలుస్తుంది. కాబట్టి షేర్ చేసుకుందాం. ఫేస్బుక్కులో అవతలివారూ ఇలాగే ఆలోచిస్తారు. కావున బోల్డన్ని లైకులొస్తాయి! బస్ - ఖేల్ ఖతం, దుకాణ్ బంద్!

వీళ్ళు - రెండో ఫొటో షేర్ చెయ్యాలని అనుకోరు. పొరబాటున షేర్ చేసినా పెద్దగా లైకుల్రావు. ఎందుకని? ఎందుకంటే - అప్పుడు భారద్దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కొన్నివర్గాలు ఇంకా దరిద్రంలోనే ఎందుకు మగ్గిపోతున్నాయి? వారిని బాగుచేస్తామని చెప్పుకుని రాజ్యాధికారం చేపట్టేవారు ఇంకాఇంకా ఎందుకు బలిసిపోతున్నారు? అన్న ఆలోచన చెయ్యాలి. అప్పుడు మనకి చాలా ఇబ్బందికర సమాధానాలొస్తయ్. ఆ సమాధానాల్ని ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం మన రాజకీయ సామాజిక ఆర్ధిక అవగాహనపై ఆధారపడి వుంటుంది. 

రెండో ఫోటోలోని పిల్లలు మురికివాడల్లో కనపడుతూనే వుంటారు. ధైర్యం వుండి అడగాలే గానీ - ఆ పాప ద్వారా మనక్కొన్ని నిజాలు తెలియొచ్చు. ఆ కుటుంబం వ్యవసాయం గిట్టుబాటు కాక పూట గడవక బస్తీకి మైగ్రేట్ అయ్యిండొచ్చు. అగ్రకులాల దాడిలోనో, మతకల్లోలంలోనో కుటుంబం దిక్కు లేనిదై అక్కడ తల దాచుకునుండొచ్చు. పచ్చని పొలాల్ని కాంక్రీటు జంగిల్‌గా మార్చే అభివృద్ధిలో స్థానం కోల్పోయిన నిర్భాగ్య కుటుంబం అయ్యుండొచ్చు లేదా గనుల కోసమో, డ్యాముల కోసమో ఆవాసం కోల్పోయిన గిరిజన కుటుంబం కావచ్చు. ప్రభుత్వ పథకాలకి అందకుండా మైళ్ళ దూరంలో ఆగిపోయి ఓటర్లుగా మిగిలిపోయిన జీవచ్చవాలూ కావచ్చు.     

'నువ్వు మురికివాడల్ని రొమేంటిసైజ్ చేస్తున్నావు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొందరు సమిధలవక తప్పుదు. ఇది చాలా దురదృష్టం. దిక్కు లేనివారికి దేవుడే దిక్కు. టీవీల్లో గంటల తరబడి సాగే ప్రవచనాలు వినడం లేదా?' అంటారా? ఓకే! ఒప్పుకుంటున్నాను. అందుచేత ప్రస్తుతానికి మనకి రెండో ఫోటో అనవసరం. హాయిగా మొదటి ఫోటో షేర్ చేసుకుందాం. మన దయాగుణాన్నీ, వితరణ శీలాన్నీ లోకానికి చాటుకుందాం. 

గమనిక -   

మొదటి ఫోటోలో చనిపోయిన బాబుకి నివాళులు అర్పిస్తూ, ఆ బాబుని మరణాన్ని ఏ మాత్రం తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదని మనవి చేసుకుంటున్నాను.

(photos courtesy : Google) 

7 comments:

  1. బ్రతికి ఉన్నవాళ్ళ వల్ల ఎప్పుడైనా సమస్యలే ! ఆ సమస్య వ్యక్తిగతమైనా సామాజికమైనా ! చావు వల్ల చాలా చాలా రిలీఫ్! కొంచెంసేపు ఏడ్చి కాస్త అందరి దృష్టిలో పడేటట్టు ఆవేశంగా ఆక్రోశంగా ప్రశ్నిస్తే చాలు ! అయిపోతుంది. అందుకే అన్నారు బ్రతికిఉన్నవారికి , చచ్చినవారికి కూడా చావంత సుఖం మరొకటి లేదని . (ఇది సామెత కాదు లెండి అది మరో విధం :) ) ఈ చిత్రాలకి అదే వర్తిస్తుందని ... నా అభిప్రాయం .

    ReplyDelete
  2. రమణ గారూ! రెండు చిత్రాలను పోలిక చేయడం కరెక్ట్ కాదు. ఏమైనా మరణం అదికూడా భయంకరమైన చావు+చిన్న పిల్లాడు. అందుకే అది అందరినీ కదిలించింది. ఇక రెండో ఫోటో. అలాంటివి చూసీ చూసీ మన తోలు,,మందమైంది, మనసు మొద్దుబారింది. అలాంటి స్లం పిల్లల్ని చూపించి విదేశీ ఫిలిం కూడా కోట్లు కొల్లగొట్టింది. మేరా భారత్ మహాన్ హై .

    ReplyDelete
  3. నీరులాంటి ప్రక్రుతి సిద్దమైన ఎంతో శక్తివంతమైన పంచ భూతాల్లో ఒకటికే పల్లం వైపు అంటే Easy way out (యాక్చువల్ గా గాలికి కూడ అల్ప పీడనం వైపే ప్రయాణించే గుణం ఉంది కానీ మనం దాన్ని కాంచ లేం కదా!!) ఉంటే మానవ మాత్రులం మనమెంత గురూ! We go easy way out too!! అవి ఎంత ప్రక్రుతి సిద్ధమో ఇదీ అంతే!

    ReplyDelete
  4. మీరు చెప్పింది నిజ్జంగా నిజం..
    నా అభిప్రాయం అయితే పెద్ద ప్రాణాలు చిన్న ప్రాణాలు అన్నీ సమానమే, ఎవరి బ్రతుక్కయినా ఇలాంటి ముగింపు బాధాకరం...


    ReplyDelete
  5. You write well, why are you not writing as frequently as you used to?

    ReplyDelete
  6. Not many post in last few weeks sir....
    We are eagerly waiting for your views and posts in different areas....

    ReplyDelete
  7. Dear Doctor, Waiting for your new posts. Agree with others. You are less frequent these days. You have many genuine silent readers like us to share your thoughts. No issues.

    ReplyDelete

Comments will be moderated, may take sometime to appear.