Saturday, July 25, 2015

తీస్తా సెటిల్వాడ్


ముప్పయ్యేళ్ళ క్రితం ఢిల్లీలో గుర్తు తెలీని మూకలు సిక్కుల్ని వెతికి వెతికి వేటాడి చంపాయి. చాల్రోజుల్దాకా నేర విచారణాధికారులకి ఆ నేరం వెనుక ఎవరున్నారో తెలీలేదు. తెలీనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కాబట్టి మిన్నకున్నారు. కానీ చచ్చినవాళ్ళ తరఫున బంధువులు గోల చేసినప్పుడు.. గతిలేని పరిస్థిలో కొందరు కాగ్రెస్ నేతలపై నేరారోపణ చేశారు. సహజంగానే ఆ కేసులు చివరిదాకా నిలబళ్ళేదు.

పదమూడేళ్ళ క్రితం గుజరాత్‌లో గుర్తు తెలీని మూకలు ముస్లింలని వెతికి వెతికి వేటాడి చంపాయి. షరా మామూలే - చాల్రోజుల్దాకా నేర విచారణాధికారులకి ఆ నేరం వెనుక ఎవరున్నారో తెలీలేదు. తెలీనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కాబట్టి మిన్నకున్నారు. కానీ చచ్చినవాళ్ళ తరఫున బంధువులు గోల చేసినప్పుడు.. గతిలేని పరిస్థిలో కొందరు బీజేపీ నేతలపై నేరారోపణ చేశారు. ఆ కేసులు పండుటాకులు రాలిపోతున్నట్లుగా ఒకటొకటిగా వీగిపోతున్నాయి. చరిత్ర పునరావృతం అవుతుందంటారు. అంటే ఇదే కాబోలు! 

మన్దేశంలో అధర్మం, అన్యాయం - గర్వంగా, పొగరుగా, నిర్లక్ష్యంగా రొమ్ము విరుచుకుని నాలుగు పాదాల మీదా నడుస్తున్నాయని దిగులు చెందాను. మన్దేశంలో న్యాయం, ధర్మం - అవమానంతో, సిగ్గుతో కుంటినడక నడుస్తున్నాయని దుఃఖించాను. మన్దేశంలో నేరపరిశోధన, నేరవిచారణ అనే పదాలకి అర్ధం లేకుండా పోయిందని ఆందోళన చెందాను. ఇప్పుడు మన్దేశంలో వ్యవస్థల ఫ్యాక్షనిస్టు మైండ్ సెట్ పట్ల భీతి చెందుతున్నాను.

శ్రీమతి తీస్తా సెటిల్వాడ్ అనే మహిళ సామాజిక కార్యకర్త. మానవ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తుంది. గుజరాత్ అల్లర్లలో చనిపోయినవారి తరఫున అనేక కేసులు వేసింది. ఆ కేసుల్లో విచారణ ఇంకా కొనసాగుతుంది.

తీస్తా సెటిల్వాడ్, ఆమె భర్త జావెద్ ఆనంద్‌లకి ఒక NGO వుంది. సంస్థ తరఫున విరాళాలు సేకరించారు. ఆ డబ్బుల్లో కొంత ఖరీదైన సారాయి బుడ్లు, సెంటు బుడ్ల కోసం సొంతంగా వాడుకున్నారట. ఇలా చెయ్యడం తప్పకుండా నేరమే. అందుకు సంబంధిన ప్రతి లొసుగునీ బయటకి లాగాల్సిందే. నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలు లభిస్తే కేసు బుక్ చెయ్యాల్సిందే, న్యాయస్థానాల్లో నిరూపించాల్సిందే. అప్పుడు నేరస్తురాలైన తీస్తాని ఎవరూ సమర్ధించరు కూడా. కానీ జరుగుతున్నదేమిటి?

తీస్తా సెటిల్వాడ్, ఆమె భర్తనీ CBI అనేకసార్లు ప్రశ్నించింది. వాళ్ళ ఆఫీసులో సోదాలు చేసింది, అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఒకటి నుండి రెండు కోట్ల దాకా నిధులు దుర్వినియోగం అయ్యాయని తేల్చింది. మరింక తీస్తాని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సింది ఏముంది? CBI ఎందుకంతలా ఉవ్విళ్ళూరుతుంది? 

ఎందుకంటే - తమకి నచ్చని వారి పట్లా, తమని ఇబ్బంది పెట్టే వారి పట్లా రాజ్యం కక్షపూరితంగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. ఇది ప్రపంచ చరిత్ర చెబుతున్న సత్యం. కక్ష తీర్చుకోవడానికి ఫాసిస్టులకి ఎటువంటి మొహమాటాలు వుండవు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇదే ప్రక్రియ త్రాచుపాము జరజరా పాకుతున్నంత మెత్తగా, మెథాడికల్‌గా సాగుతుంది. మొడస్ ఒపరాండై ఏదైనా ఫలితం మాత్రం ఒకటే!

ఏ విషయాన్నైనా ఒక హోప్‌తో, ఒక పాజిటివ్ నోట్‌తో ముగించాలని అంటారు. కాబట్టి - 

నేర పరిశోధనా సంస్థల వారు తీస్తా కేసుపై చూపిస్తున్న ఆత్రుత, ఉత్సాహం అన్ని కేసుల పైనా చూపించాలని ఆశిస్తున్నాను (ఇలా ఆశించడం ఎంత హాస్యాస్పదం అయినా ఆశించడం మినహా చెయ్యగలిగిందేమీ లేదు కాబట్టి). 

గమనిక -

కామెంట్ డబ్బా లేదు. 

(picture courtesy : Google)