హేమమాలిని నా అభిమాన నటి. అసలు హేమమాలినిని నటి అనవచ్చునా? ఎందుకంటే నాకు తెలిసి ఆమె ఎప్పుడూ నటించలేదు, నటించడానికి ప్రయత్నించనూ లేదు. తన వీక్ పాయింట్స్ తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తించువారే విజ్ఞులు. హేమమాలిని విజ్ఞురాలు. అందుకనే - ఏ సినిమాలోనూ నటించకుండా సాధ్యమైనంత ఎక్కువ అందంగా వుండటానికి ప్రయత్నించింది. అయినా కూడా హేమమాలిని నా అభిమాన నటి అని గర్వంగా ప్రకటించుకుంటున్నాను.
నాల్రోజుల క్రితం జరిగిన ఒక రోడ్డు యాక్సిడెంటు ద్వారా హేమమాలిని మళ్ళీ వార్తల్లో వ్యక్తి అయింది. యాక్సిడెంట్ తరవాత గాయపడిన వారిని వారి చావుకి వదిలేసి ఆమె మాత్రమే వేరే కార్లో హడావుడిగా ఆస్పత్రికి వెళ్లిపోవడం సరి కాదని విమర్శకుల అభిప్రాయం. సరే! ఒప్పుకుంటున్నాను. కానీ మేధావులందరూ కట్ట గట్టుకుని హేమమాలి ఏటిట్యూడ్‌ని చెండుకు తిండం నాకు బాధగా వుంది. ఎంతైనా నేనామెకు అభిమానిని కదా. నా డ్రీమ్ గాళ్ కష్టాల్లో వున్నప్పుడు ఆమెని సమర్ధిస్తూ నాలుగు ముక్కలు రాయడం నా బాధ్యతగా భావించి ఈ పోస్ట్ రాస్తున్నాను.
దక్షిణ భారద్దేశాన్ని ఇడ్లీ సాంబార్ ల్యాండ్‌గా మాత్రమే చూసే హిందీ వాళ్ళతో నెగ్గుకు రావడం అంత తేలిక కాదు. అట్లాంటి హిందీ సినిమా రంగంలో చాలా తక్కువ కాలంలో ఎక్కువ స్థాయికి చేరుకుంది హేమమాలిని. ఇందుకు హేమమాలినిని అభినందిస్తున్నాను. ఆ తరవాత ఆల్రెడీ పెళ్లై పిల్లలున్న ధర్మేంద్రని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అనాదిగా అందమైన సినిమా హీరోయిన్లు పెళ్లై పిల్లలున్నవారినే ఎందుకు ప్రేమిస్తారో తెలీదు. సరే! ఇది ఆయా నటీమణుల వ్యక్తిగత వ్యవహారం కనుక ఇంతటితో ఈ విషయం వదిలేస్తాను.
ఒకప్పుడు సినిమా నటులు సినిమాల్లో, రాజకీయ నాయకులు రాజకీయాల్లో వుండేవాళ్ళు(ట)! గత కొన్నేళ్లుగా రాజకీయ నాయకుల క్రెడిబిలిటీ దెబ్బ తినడం చేత ఎన్నికల సమయంలో పాపులారిటీ వున్న సినిమా నటులకి టిక్కెట్లిచ్చి గెలిపించుకోవడం మొదలైంది. సినిమా వాళ్ళు ఏ పార్టీ టిక్కెట్ ఇస్తే ఆ పార్టీ తరఫున నిలబడతారు. గెలిచినా ఓడినా వీరికి పెద్దగా రాజకీయ జ్ఞానం వుండదు. అందరూ గొప్ప జ్ఞానవంతులైతే ప్రపంచం పరమ బోరుగా వుంటుంది. ఎప్పుడైనా అజ్ఞానమే ముచ్చటగా వుంటుంది!
పుచ్చలపల్లి సుందరయ్య వంటి పార్లమెంటేరియన్లు సైకిల్ తొక్కేవారని విన్నాను. ఇవ్వాళ సైకిల్ తొక్కేవాళ్ళకి వోటు హక్కు మాత్రమే మిగిలింది. పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు ఎన్నికల సమయంలో టికెట్ కొనుక్కుంటున్నారు. సెలబ్రిటీలు వారి గెలుపు అవకాశల బట్టి టికెట్ పొందుతున్నారు. ప్రజల సమస్యల గూర్చి వీరెవ్వరికి అవగాహన వుండదు. వీరికా జ్ఞానం వుండాలని ఆయా రాజకీయ పార్టీలూ అనుకోవట్లేదు. ఆ పార్టీల నాయకత్వానికి కావాల్సింది విప్ జారీ చేసినప్పుడు బుద్ధిగా ఓటేసే అజ్ఞాన ప్రజా ప్రతినిథులు మాత్రమే.
టూకీగా చెప్పాలంటే వీళ్ళు ఎమ్మెల్యే, ఎంపీలుగా కాకముందు ఫైవ్ స్టార్ మనుషులు. ఎన్నికల్లో గెల్చినంత మాత్రానికే రాత్రికి రాత్రి ప్రజల మనుషులుగా ఎలా మారిపోతారు? మరప్పుడు హేమమాలిని ఒక ఎంపీగా ఎంతో బాధ్యతాయుతంగా వుండాలని ఎందుకు ఆశిస్తున్నారు!? సోషల్ మీడియా మేధావులు నా అభిమాన నటి గొప్ప రాజకీయ పరిజ్ఞానంతో, క్షేత్రస్థాయి కార్యాచరణతో ఎంపీ అయ్యిందని నమ్ముతున్నారా!?
ఒక కారు ఇంకో కారుతో గుద్దుకుంది. ఇదసలు విషయం కాదు. ఒక బెంజ్ కారు ఆల్టో కారుని గుద్దింది. ఇదీ అసలు విషయం! భారద్దేశంలో బెంజ్ కారు ఆల్టో కారుని గుద్దుకుంటే ఏమవుతుందో - భారతీయుడు సినిమాలో ముసలి కమల్ హసన్ వంటి అమాయకులకి తప్ప అందరికీ తెలుసు. స్పీడుగా వెళ్ళే మన మంత్రిగార్ల కాన్వాయ్ గుద్దుకుని ఎంతమందికి దెబ్బలు తగల్లేదు? నాకు తెలిసి ఏ మంత్రిగారూ పన్లాపుకుని బాధితుల్ని ఆస్పత్రికి తీసుకెళ్ళిన సందర్భం లేదు. మరి - హేమమాలిని విషయంలోనే ఎందుకింత పట్టింపు!?
రామచిలక అందంగా వుందని వెండి సింహాసనంపై కూర్చుండబెట్టాం. తన అందచందాలతో మన మనసుని ఆనంద పరచడమే దానికి తెలిసిన విద్య. ఇవ్వాళ అవసరం పడిందని రామచిలకని కోయిలలా పాట పాడాలని కోరుకోవడం సబబా? అది రామచిలక పని కాదు గదా? అంచేత - ఒక చిన్నపిల్ల చనిపోయిందనే బాధ తగుమాత్రంగా మాత్రమే పడి, అందమైన హేమమాలిని మొహంపై గాట్లేమైనా పడ్డాయేమోనని కలత చెందుదాం! వ్యధ చెందుదాం!
హేమమాలిని! గెట్ వెల్ సూన్!
చివరి తోక -
హేమమాలినిపై 'పని లేక.. ' బ్లాగులో 'హేమమాలిని! బెస్టాఫ్ లక్' అంటూ ఒక పోస్టు రాశాను. ఓపిక వున్నవాళ్ళు చదువుకోవచ్చు.
(picture courtesy : Google)