Sunday, December 13, 2015

రావిశాస్త్రి చేసిన మేలు


"నువ్వు కథలేమన్నా రాశావా?"

"లేదు."

"రాయొచ్చుగా?"

నా స్నేహితుల్లో ఎక్కువమంది డాక్టర్లు. ప్లీడర్లకి ప్లీడర్లూ, దొంగలకి దొంగలూ.. ఇలా యే వృత్తివారికి ఆ వృత్తిలోనే స్నేహాలుంటయ్. కొందరు డాక్టర్లని తెలివైనవారిగా భావిస్తారు. నేనైతే అలా అనుకోవడం లేదు. ఎందుకంటే - నాకు తెలిసి అనేకమంది డాక్టర్లలో వృత్తిపరమైన నైపుణ్యం తప్ప ఇంకే విషయంలోనూ పెద్దగా అవగాహన లేదు.

నా స్నేహితులకి నేను రాస్తానని తెలుసు గానీ - ఏం రాస్తానో తెలీదు. అంచేత 'కథల్రాస్తున్నావా?' అంటూ మర్యాద కోసం అడుగుతుంటారు. ఇంకొందరు నాకు కథలు రాసేంత తెలివున్నాకూడా రాయకుండా నా ప్రతిభని వృధా చేస్తున్నానని అనుకుంటారు! ఇలా అడిగిన వాళ్ళ చదువరితనంపై నాకేమీ భ్రమల్లేవు. వాళ్ళు - చిన్నప్పుడు చదివిన చందమామ తప్ప ఇంకేదీ చదివుండరు, సెలవు చీటి మించి ఇంకేదీ రాసుండరు. కాబట్టి వాళ్ళ ప్రశ్నకి చిరునవ్వే సమాధానంగా ఊరుకుంటాను.  

హైస్కూల్ రోజుల్లో నేను వారపత్రికలు చదివేవాణ్ని. అదే సాహిత్యం అనే భ్రమలో కూడా వుండేవాణ్ని. అంచేత ఎప్పటికోకప్పుడు నేను కూడా కొన్ని కథలు రాయకపోతానా అన్న మిణుకు మిణుకు ఆశతో వుండేవాణ్ని. కొంతకాలానికి రావిశాస్త్రి చదివాను. గుండె గుభిల్లుమంది! ఇంకా నయం - కథ రాసి నా అజ్ఞానాహంకారముల్ని లోకానికి చాటుకున్నాను కాదు! ఆవిధంగా తెలుగు పాఠకులు అదృష్టవంతులయ్యారు.

నేను కథ రాయకపోవడం వల్ల తెలుగు పాఠకులకే కాదు, నాకూ చాలా లాభించింది! లేపోతే ఉత్సాహంగా అనేక కథలు రాసి సమయం వృధా చేసుకునేవాణ్ని! అవును - నాకు విలువైన జీవితానుభవం లేదు (సినిమాలు, షికార్లు, హోటళ్ళు - జీవితానుభవం కాదు). సాహిత్యంతో పరిచయం లేదు (వారపత్రికల (అ)జ్ఞానం సాహిత్యానుభవం కాదు). కావున కడుపు నిండిన సరదా కథలేవో కొన్ని వండగలిగేవాణ్నేమో గానీ - 'మంచికథ' మాత్రం ఖచ్చితంగా రాయగలిగేవాణ్నికాదు.

రావిశాస్త్రి వల్ల నాకింకో మేలు కలిగింది. నేనప్పటిదాకా చదివిన కథలన్నీ పరమచెత్తని కూడా గ్రహించే జ్ఞానం అబ్బింది. అంచేత అర్జంటుగా తెలుగు కథలు చదవడం మానేశాను, నా సమయాన్ని మరింత ఆదా చేసుకున్నాను. అయితే కథల్రాయడం వల్ల ప్రయోజనం లేదా? పాఠకుల సంగతేమో గానీ, రచయితకి మాత్రం ప్రయోజనమే!

నాలుగేళ్ల క్రితం నాకో డాక్టర్ అనుసరిస్తున్న అరాచక, భీభత్స వైద్యంపై చాలా కోపం వచ్చింది. ఏం చెయ్యాలి? ఏం చెయ్యగలను? బాగా ఆలోచించాక ఆ డాక్టరాధముణ్ని ఒక కథతో కొట్టాలని నిర్ణయించుకున్నాను. ఆ రాత్రి చాలాసేపు మేలుకుని కథొకటి టైప్ కొట్టాను. మర్నాడు నా కథ చదువుకొని బిత్తరపొయ్యాను - పరమ చెత్త! కానీ ఆశ్చర్యంగా ఆ క్షణం నుండి నాకా డాక్టర్ మీద కోపం పోయింది! ఇది రచయితగా నాకు చేకూరిన కథా ప్రయోజనం అనుకుంటున్నాను!

అటుతరవాత నా కథ గూర్చి ఈ నాలుగేళ్ళలో నాలుగు నిమిషాలు కూడా ఆలోచించలేదు. కానీ.. కానీ.. ఎవడి మీదో కోపం వచ్చి ఏదో రాసినా - అది నా కీబోర్డులో నా వేళ్ళ మీద గుండా జాలువారిన కథ! కావున నా కథని అలా చిత్తుప్రతిగా వదిలెయ్యడం సరికాదు. ఇది ఆడపిల్ల పుట్టిందని రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయినంత రాక్షసత్వంతో సమానం! అంచేత ఆ కథని నా బ్లాగులో పబ్లిష్ చెయ్య నిర్ణయించాను. చెత్తలో చెత్త - కలిసిపోతుంది!

(picture courtesy : Google)

6 comments:


  1. పోయిన ఆ రావి శాస్త్రి ఏ లోకం లో ఉన్నారో ఏమో !

    వారిని ఇంత గా భయ పెట్టేస్తే ఎట్లాగండి కథలు బ్లాగుల్లో వదులుతా నని చెబ్తూ :) పాపం పెద్దాయన :)

    ఎప్పటి నించి మీ కథలు మొదలు ?

    వేచి చూడుము వెండి తెర పై అంటారా :)

    ఆల్ ది బెస్ట్ !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి జీ,

      హ.. హ.. హా! రావిశాస్త్రి ఎక్కడికీ వెళ్ళలేదు, నాలాంటివారి గుండెల్లోనే వున్నాడు!

      నాకథ గూర్చి మీరస్సలు భయపడొద్దు. అదొక కథావ్యాసం లేక వ్యాసకథ! యేదో స్టోర్ రూములో పడేసినట్లు అలా ఉంటుందని ఆశ! అంతకుమించి మరేం లేదు.

      మన బ్లాగ్లోకం కులాసాయేనా? మీరందరూ నా ఆత్మీయులే. థాంక్యూ ఫర్ ద కామెంట్.

      Delete
  2. సార్...మీ కథ బాగుందో లేదో చెప్పాల్సింది మేం కదా...
    మీ కథను చదివే అదృష్టం కల్పించండి.
    థాంక్యూ.

    ReplyDelete
    Replies
    1. Thank you for the nice words. I'll send the story to you.

      Delete
  3. Come on, shoot your stories please. Love to read them, eagerly waiting.

    ReplyDelete
    Replies
    1. I have only one story, half-cooked and yet to be served!

      Delete

Comments will be moderated, may take sometime to appear.