Friday, July 3, 2015

పంచాగ్ని

జీవితం చిత్రమైంది. ఒక్కో దశలో ఒక్కో అనుభవం హాయిగా వుంటుంది. ఆ తరవాత కొన్నాళ్ళకి అదే అనుభవం చిరాగ్గా కూడా వుండొచ్చు. ఒకప్పుడు నాకు స్నేహితులతో కలిసి సినిమా చూడ్డం అనేది గొప్ప అనుభవం. చదువైపొయ్యాక స్నేహితులు తలో దిక్కూ వెళ్ళిపొయ్యారు. ఆ తరవాత సినిమాలు చూడ్డానికి ప్రయత్నించాను గానీ - నా వల్ల కాలేదు. హఠాత్తుగా తెలుగు సినిమా స్థాయి దిగజారిందా? లేక స్నేహితుల్తో చెత్త సినిమాల్ని కూడా సరదాగా చూసేశానా?

టీవీ వొచ్చిన కొత్తలో టీవీ అంటే ప్రభుత్వ అధ్వర్యంలో నడిచే దూరదర్శన్ మాత్రమే. దూరదర్శన్‌వాళ్ళు ఎవార్డులు పొందిన ప్రాంతీయ చిత్రాల్ని ప్రసారం చేసేవాళ్ళు (ప్రభుత్వం అప్పుడప్పుడు మంచి పన్లు కూడా చేస్తుంటుంది). ఆ విధంగా ఒకానొక ఆదివారం మధ్యాహ్నం యాక్సిడెంటల్‌గా ఒక మళయాళం సినిమా చూశాను. సినిమా పేరు 'పంచాగ్ని'.

కథలో ప్రధాన పాత్ర ఇందిర, నక్సలైట్ పార్టీ కార్యకర్త. ప్రస్తుతం యావజ్జీవ కారాగార శిక్ష (లైఫ్ సెంటెన్స్‌కి తెలుగులో ఇంతకన్నా తేలిక పదం వుంటే ఎంత బాగుణ్ను) అనుభవిస్తున్న ఖైది. ఆవిడ కొన్నాళ్ళకి పెరోల్‌పై బయటకొస్తుంది (స్కూల్ పిల్లలకి సెలవల్లా ఖైదీలక్కూడా సెలవలు వుంటాయని సినిమా చూశాకే తెలిసింది). కాలంతో పాటు మారిన ప్రపంచంలో - మారిన కుటుంబం, మారిన స్నేహితులతో ఆ అమ్మాయి అనుభవాల సమాహారమే ఈ కథ. సినిమా చివర్లో ఇందిర ఇంకో హత్య చేసి మళ్ళీ జైలుకెల్తుంది. కథకి లింక్ ఇస్తున్నాను, ఓపిక వున్నవాళ్ళు చదూకోవచ్చు.

నాకు ADHD వుందేమోనని నా అనుమానం. ఏ సినిమా అయినా మరీ బాగుంటే గానీ కుదురుగా కూర్చొని చూళ్ళేను. 'కొద్దిసేపు చూద్దాంలే' అనుకున్న నన్ను ఈ సినిమా రెండు గంటల పైగా తనతో వుంచేసుకుంది. నన్నిలా తనతో వుంచేసుకునే ఏ సినిమా అయినా మంచి సినిమా అని నా నమ్మకం. అట్లాంటి మంచి సినిమా తీసిన వాడే మంచి దర్శకుడు. తీసినవాడు అకిరా కురసోవా అవ్వచ్చు లేదా సత్యజిత్ రే అవ్వచ్చు - ఎవరికైనా సరే! ఇదే సూత్రం వర్తిస్తుంది.

అటు తరవాత కొన్నాళ్ళకి పీజిలో చేరాను. అక్కడ సైకియాట్రీ డిపార్ట్‌మెంట్‌ నిండా మలయాళీలు! నా సీనియర్ పి.ఎస్.శశిధరన్ (శశి) నాకు సన్నిహితుడయ్యాడు. శశి ఎక్కువగా పుస్తకాలు చదువుతాడు, తక్కువగా మాట్లాడతాడు. ఓసారి శశితో 'పంచాగ్ని' సంగతి ప్రస్తావించాను. శశి తన భీభత్సమైన మలయాళీ యాసతో సినిమా రచయిత ఎం.టి.వాసుదేవన్ నాయర్ (MT) గూర్చి ఎన్నో వివరాలు చెప్పాడు. అటు తరవాత శశితో కలిసి ఒకట్రెండు మలయాళీ సినిమాలు చూశాను. ఆ సినిమాలేంటో గుర్తు లేవు కానీ - రెండూ మోహన్‌లాల్ సినిమాలే అన్న విషయం మాత్రం గుర్తుంది.

ఎప్పుడో చూసిన సినిమాని గుర్తు తెచ్చుకోవడం నాకు చాలా ఆనందంగా వుంది (నాకింకా డిమెన్షియా పూర్తి స్థాయిలో రాలేదన్న సంతోషం కూడా ఇంకో కారణం కావచ్చు). నాకు కొన్ని విషయాలు నచ్చుతయ్, ఇంకొన్ని నచ్చవు. నచ్చేవి నచ్చనివీ కాలానుగతంగా interchangeable. అందరికీ ఇంతేనా? నా వొక్కడికి మాత్రమేనా? అన్నది తెలీదు.

ఇవ్వాళ నేను 'పంచాగ్ని' సినిమాని మొత్తం చూడగలనా? చూసినా సినిమా మళ్ళీ నచ్చుతుందా? ఈ ప్రశ్నలకి సమాధానం నా దగ్గర లేదు. ఒకానొకప్పుడు నాకీ సినిమా నచ్చిందని గుర్తు చేసుకోవడమే ఈ పోస్ట్ యొక్క ఉద్దేశం. కావున -  ఈ పోస్ట్ చదివి పంచాగ్ని సినిమా చూసి.. సినిమా దరిద్రంగా వుందనీ, అనవసరంగా సమయం వృధా అయిందనీ ఎవరైనా చింతించిన యెడల - వారికి (ముందుగానే) నా సానుభూతి తెలియ జేసుకుంటున్నాను (ఇది మాత్రం ఖచ్చితంగా డిస్క్లైమర్).

ముగింపు -

నే చదూకునే రోజుల్లో మళయాళీ బూతు సినిమాలు కృష్ణ సినిమాల కన్నా స్పీడుగా ఠపీఠపీమంటూ వచ్చేవి. రతినిర్వేదం, సత్రంలో ఒక రాత్రి.. ఇలా పేర్లతోనే కుర్రకారుని కిర్రెక్కించేవి. ఈ సినిమాలకి మా గుంటూరు రంగమహల్ నూన్ షోలతో నిలయంగా వుండేది. బయట ఎర్రని ఎండ వల్లనూ, లోపల వేడి నిట్టూర్పుల వల్లనూ - వాతావరణం భగభగా మండిపొయ్యేది!

నా ఆత్మీయ మిత్రుడొకడు బట్టలు తక్కువగానున్న స్త్రీల యెడల మిక్కిలి ఆసక్తి కలిగుండేవాడు. అంచేత రంగమహల్ అతగాడి కేరాఫ్ అడ్రెస్‌గా విలసిల్లేది! ఏ సినిమాలో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు 'గిట్టుబాటు సీన్లు' వుండేవో అతనికి కొట్టిన పిండి, దంచిన కారం. ఓసారి 'పంచాగ్ని చూశావా?' అనడిగాను. క్షణకాలం ఆలోచించి 'కామాగ్ని చూశాను. పంచాగ్ని చూళ్ళేదు' అని చెప్పాడు!

గమనిక -

ఈ పోస్టుకి కామెంట్ డబ్బా లేదు.      

(picture courtesy : Google)